నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com

Tuesday, August 24, 2010







అమ్మలోని ఆప్యాయతను అందిపుచుకున్న అనురాగానివి నువ్వు,నాన్నలోని నిరాడంబరతను నింపిబుచుకున్న నువ్వు, ప్రతి క్షణం ప్రేమను పంచే ప్రాణానివి నువ్వు, అనుక్షణం అబిమానాన్ని అందించే అపురూపానివి నువ్వు, చిరునవ్వుల ఉదయాలతో నా గుండెలో ఆనందపు కిరణాలను ప్రసరిస్తావు, మధురమైన మాటలతో నా మనసులొ చిరుజల్లులు కురిపిస్తావు, ఈ ప్రేమ ప్రతి క్షణం నాకు నీడలా తోడుండాలని, నీకు ప్రతీక్షణం నేను తండ్రిలా తోడుంటానని ఈ రక్షాబంధనం ద్వారా తెలుపుతున్నాను, "రక్షాబంధనం" శుభాకాంక్షలు నా చిరునవ్వుల సోదరీ మణులైన శ్రీమతి లీలావతి మరియూ శ్రీమతి సౌభాగ్య లక్ష్మి అక్కయ్యలకు ... ప్రేమతో... రాఖీ శుభాకాంక్షలు.


ప్రాముఖ్యత:

భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.ఈ పండుగ మూడు నాలుగు రకాలుగా కూడా ఉంది. రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, హయగ్రీవ పూజ, వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం :

'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః, తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'



దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.


దైవీశక్తులతో కూడిన శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీపూర్ణిమగా, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటారు. శక్తిస్వరూపిణిగా వ్యవహరించబడే ఇంటి ఆడపడచు(సోదరి) చేత ఈరోజు రక్షాబంధనం కట్టించుకున్న సోదరులకు దేవతలు రక్ష గా నిలిచి అరిష్టాలను తొలగిస్తారని, అన్నింటా అండదండగా నిలుస్తారని విశ్వాసం. ఈరోజున బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తదితర జంధ్యాన్ని ధరించే అన్ని కులాలవారు స్నానాన్ని ఆచరించి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి ఉపాకర్మ జరిపిస్తారు. అందుకే దీనికి జంధ్యాల పూర్ణిమ అని పేరొచ్చింది. ఈరోజునే హయగ్రీవ జయంతి "జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే' అంటూ సర్వవిద్యలకూ ఆధారభూతంగా చెప్పుకునే హయగ్రీవుని స్తుతించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్ర వచనం.