నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com

Wednesday, March 24, 2010

టేకుమళ్ళ గ్రామం చూసారా?



"టేకుమట్ల" అనే వూరు నల్గొండ జిల్లా లో (హైదరాబాదు - విజయవాడ రోడ్డు మార్గం లో) ఉంది. అదే కాలక్రమేణా "టేకుమళ్ళ" గా మారి ఉండ వచ్చు. అదే, టేకుమళ్ళ వారి పూర్వీకుల జన్మ స్తలం గా భావించడం జరుగుతోంది.పై చిత్రం లో టేకుమళ్ళ అనే గ్రామం బోర్డు చూడవచ్చు

Tuesday, March 23, 2010

టేకుమళ్ళ వెంకట శేషయ్య 61 వ జన్మదినోత్సవము




19 వ తేదీ మార్చి నెల 2010 టేకుమళ్ళ వెంకట శేషయ్య గారి జన్మ దినోత్సవము వారి స్వగృహం లో ఘనం గా జరిగింది.

తే!గీ! టేకుమళ్ళకు వెలుగాయె టంకణముగ!
జన్మ సఫలత జెందెను జగతి నందు!
దేవ దేవుడ గాయుము దయను జూపి!
ఆయురారోగ్య ఐశ్వర్య మానతిమ్ము.



వారి కుటుంబ సభ్యుల సమక్షం లో జన్మదినోత్సవం వైభవోపేతం గా జరిగింది. భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను.

Saturday, March 20, 2010

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు





శ్రీ రామ రామ రామేతి, రమె రామె మనోరమె
సహస్ర నామ తత్తుల్యం, రామ నామ వరాననె

అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమి అనగానే గుళ్ళలో పందిళ్ళు, వడపప్పు పానకాలు, సీతారామ కళ్యాణం, ముఖ్యంగా ఊళ్ళల్లో ఐతే పండగ అనే కంటే ఒక పెళ్లి వాతావరణం ఉంటుంది. పెళ్లన్నా, పెళ్లి హడావుడి అన్నా ఇష్టం లేని వాళ్ళెవరు? బహుశా అందుకేనేమో నాకు శ్రీ రామ నవమి అంటే పండగలలో ప్రత్యేకమయిన ఇష్టం. శ్రీ రాముడు మన దేవుడన్న విషయం పక్కన పెట్టినా, రాముడు ఆదర్శ పురుషుడికి ప్రతిరూపం. రామాయణం - మనిషి ఎలా బతికితే మనిషి అనిపించుకున్టాడో చెప్పే ఒక గైడ్. సమాజం సవ్యంగా నడవడానికి ఒక మార్గం. దానిలోని సారాన్ని గ్రహించి ప్రస్తుత పరిస్థితులకి అన్వయించి వాడుకుంటే రామాయణ పరమార్థం అవపోసన పట్టినట్టే అని నా ఉద్దేశ్యం.


సీతారాముల శుభ చరితం రస భరితం ఇది నిరితం
కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం

భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము.
ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:

రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము . ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్ధనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రదమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమ శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. ఒక్కమారు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.




శ్రీ రాముని ప్రసక్తి వస్తే, శ్రీ రామదాసు (కంచెర్ల గోపన్న) ప్రసక్తి అనివార్యం.

భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కదంబ దంపతులకు జన్మించినాడు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ తెలుగువారికి శ్రీరామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కధ యున్నది)

గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని లబించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.

అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని స్వతహాగా హరి భక్తులైన గోపన్న సంకల్పించాడు. అందుకు విరాళములు సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.(ఈ విషయములో అనేకమైన కధలున్నాయి.) కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును.



హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.


ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను.

ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. హనుమంతుని స్మరించినయెడల సీతారాములు ప్రసన్నులగుదురు. హనుమంతుని పేరు వినబడినచోట దయ్యములు ఉండలేవు. సుందరకాండ చదివితే కార్యములు సిద్ధించును. సకల వాంఛితార్థములకు హనుమంతుని ప్రార్థింపవచ్చును. మోక్షమునకు తప్ప మిగిలిన కోరికల కొరకు శ్రీరాముని నేరుగా భజింపవలదు.

అందుకే అనుకుంటా ఎన్ని రామాయణాలు వచ్చినా, రామాయణం లోంచి ఎన్ని కథలు వచ్చినా అతి మధురంగా ఉంటాయి. ఎన్ని సార్లు చూసినా విన్నా తరగని సుధలా మనసుకు విందు చేస్తుంటాయి. త్యాగయ్య జగదానంద కారకా అన్నా, బ్రోచేవారెవరురా అన్నా - రామదాసు అంతా రామమయమన్నా మది పులకిస్తుంది. భక్తితో ఆనంద తాండవం చేస్తుంది. రామగానామృతం లో ఆర్తిగా తడుస్తుంది.

Wednesday, March 17, 2010

ఉగాది ప్రాముఖ్యం



16 మార్ఛి 2010 విక్రుతి నామ సంవత్సరం ఆరంభము

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.
ఉగాది ప్రాముఖ్యం

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. [1]. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.

"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.



సంప్రదాయాలు
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు

తైలాభ్యంగనం
నూతన సంవత్సరాది స్తోత్రం
నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.[2]

పూజాదులు
అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.

ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి"ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తిని పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటాఱు.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు,ఆ చారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.

ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరిక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం. [3]

ఉగాది ప్రసాదం
ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రశాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్నా సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

పంచాంగ శ్రవణం
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది.

నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు,పూజా పునస్కారాలు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.
ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

Wednesday, March 10, 2010

శ్రీమతి టేకుమళ్ళ (పులిగండ్ల) చిదంబరి కి గిన్నీస్ బుక్ వారి ప్రశంసా పత్రం.




శ్రీ అన్నమాచార్య 601 జయంతి సంధర్భంగా, 10 మే నెల 2009 నాడు సికిందరాబాదు పరేడ్ గ్రవుండ్స్ లో "లక్ష గళార్చన" జరిగింది. దానిలో పాల్గొని సాంప్రదాయ బద్ధంగా అన్నమాచార్య కీర్తనలు గానం చేసినందుకు గాను, "గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్" వారు శ్రీమతి చిదంబరి కి ప్రశంశా పత్రం ప్రదానం చేసారు.

Monday, March 8, 2010

శ్రీమతి టేకుమళ్ళ (పులిగండ్ల)చిదంబరి కి "భారత మహిళా శిరోమణి" అవార్డు


సన్మాన కర్యక్రమం లో..పి.వి.రంగారావు, రోడ్లు భవనాల శాఖా మంత్రి శ్రీమతి గల్లా అరుణ కుమారి, సన్మానితురాలు శ్రీ మతి చిదంబరి, ఎన్.టీ.ఆర్.విజ్ఞాన్ ట్రస్ట్ అద్యక్షురాలు లక్ష్మీ పార్వతి, టీ.వీ. యాంకర్ శ్రీమతి ప్రీతీ నిగం.


శ్రీమతి లక్ష్మీ పార్వతి తో ముచ్చట్లు.




శ్రీమతి పి.చిదంబరి, శ్రీ పి.ఎస్.విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ హై స్కూల్లో సైన్సు, ఇంగ్లీషు ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నారు. సంగీతంలో గాత్రం లో డిప్లొమా చేసి పలు సంగీత కచ్చేరీలు ఇచారు. ఎమ్మెస్సీ, ఎం.ఈడీ చదివారు. తరగతి లో వెనుక బడిన విద్యార్ధులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించడం, సంగీతం క్లాసులు నిర్వహించి వారికి సంగీతం లో అభినివేశం కల్పించడం.సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లలకు ఎప్పటికప్పుడు తాజా సైన్సు సమాచారం అందించడం. ఎయిడ్స్, పల్సు పోలియొ వంటి కర్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం. సైన్సు ఫేర్లు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సమర్ధవంతం గా నిర్వహించారు.
వీరి సంతానం ఐ.ఐ.టి., కంపెనీ సెక్రటరీ వంటి ఉన్నత విద్యాభ్యాసం చేయడం లో వీరి పాత్ర ఎంతో ఉంది. ఒక అదర్శ తల్లిగా, గాయకురాలిగా, టీచరుగా, సంఘ సేవా తత్పరురాలిగా, బహుముఖ పాత్రలు సమర్ధవంతం గా పోషిస్తున్నందుకు, హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ వారు మార్చి 8వ తేదీ సాయంత్రం 7 గంటలకు "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" ను పురస్కరించుకొని హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో శ్రీమతి చిదంబరి కి "భారత మహిళా శిరోమణి" అవార్డు ప్రదానం చేసారు. విజయవాడ నగరానికి ఈమె ఒక్కతే ఎంపిక కావడం గమనించ దగ్గ విశేషం.