నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com

Saturday, March 20, 2010

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు





శ్రీ రామ రామ రామేతి, రమె రామె మనోరమె
సహస్ర నామ తత్తుల్యం, రామ నామ వరాననె

అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమి అనగానే గుళ్ళలో పందిళ్ళు, వడపప్పు పానకాలు, సీతారామ కళ్యాణం, ముఖ్యంగా ఊళ్ళల్లో ఐతే పండగ అనే కంటే ఒక పెళ్లి వాతావరణం ఉంటుంది. పెళ్లన్నా, పెళ్లి హడావుడి అన్నా ఇష్టం లేని వాళ్ళెవరు? బహుశా అందుకేనేమో నాకు శ్రీ రామ నవమి అంటే పండగలలో ప్రత్యేకమయిన ఇష్టం. శ్రీ రాముడు మన దేవుడన్న విషయం పక్కన పెట్టినా, రాముడు ఆదర్శ పురుషుడికి ప్రతిరూపం. రామాయణం - మనిషి ఎలా బతికితే మనిషి అనిపించుకున్టాడో చెప్పే ఒక గైడ్. సమాజం సవ్యంగా నడవడానికి ఒక మార్గం. దానిలోని సారాన్ని గ్రహించి ప్రస్తుత పరిస్థితులకి అన్వయించి వాడుకుంటే రామాయణ పరమార్థం అవపోసన పట్టినట్టే అని నా ఉద్దేశ్యం.


సీతారాముల శుభ చరితం రస భరితం ఇది నిరితం
కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం

భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము.
ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:

రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము . ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్ధనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రదమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమ శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. ఒక్కమారు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.




శ్రీ రాముని ప్రసక్తి వస్తే, శ్రీ రామదాసు (కంచెర్ల గోపన్న) ప్రసక్తి అనివార్యం.

భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కదంబ దంపతులకు జన్మించినాడు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ తెలుగువారికి శ్రీరామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కధ యున్నది)

గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని లబించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.

అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని స్వతహాగా హరి భక్తులైన గోపన్న సంకల్పించాడు. అందుకు విరాళములు సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.(ఈ విషయములో అనేకమైన కధలున్నాయి.) కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును.



హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.


ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను.

ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. హనుమంతుని స్మరించినయెడల సీతారాములు ప్రసన్నులగుదురు. హనుమంతుని పేరు వినబడినచోట దయ్యములు ఉండలేవు. సుందరకాండ చదివితే కార్యములు సిద్ధించును. సకల వాంఛితార్థములకు హనుమంతుని ప్రార్థింపవచ్చును. మోక్షమునకు తప్ప మిగిలిన కోరికల కొరకు శ్రీరాముని నేరుగా భజింపవలదు.

అందుకే అనుకుంటా ఎన్ని రామాయణాలు వచ్చినా, రామాయణం లోంచి ఎన్ని కథలు వచ్చినా అతి మధురంగా ఉంటాయి. ఎన్ని సార్లు చూసినా విన్నా తరగని సుధలా మనసుకు విందు చేస్తుంటాయి. త్యాగయ్య జగదానంద కారకా అన్నా, బ్రోచేవారెవరురా అన్నా - రామదాసు అంతా రామమయమన్నా మది పులకిస్తుంది. భక్తితో ఆనంద తాండవం చేస్తుంది. రామగానామృతం లో ఆర్తిగా తడుస్తుంది.

0 comments:

Post a Comment